దైహిక ఔషధ ప్రయోగం (సిస్టమిక్ మెడికేషన్)నొప్పి నివారక మందులను ప్రసూతి సమయంలో రక్తంలోకి పంపించడంవల్ల కొంతవరకు ఉపశమనం కలిగినా నొప్పి పూర్తిగా పోదు. ఈ మందులను సాధారణంగా ప్రసూతి వైద్యులు, మిడ్ వైఫ్ లు తెప్పిస్తారు. నర్సులు సిరలద్వారా (ఇంట్రావీనస్) గాని, కండరాల ద్వారా(ఇంట్రామస్కులర్) గాని రక్తంలోకి పంపిస్తారు. నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో నల్లమందు సంబంధిత (ఓపియాయిడ్) మందులు బాగా పనిచేస్తుయి. ప్రసూతి సమయంలో వీటి వాడకం ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం మత్తునిచ్చే పదార్థాలు ఎన్నో అందుబాటులో ఉన్నప్పటికీ మెపెరిడిన్ (డిమరాల్), మార్ఫిన్, ఫెంటానిల్, బ్యూటోర్ఫనాల్ (స్టాడాల్), నాల్బుఫైన్ (న్యూబెయిన్) వంటి మందులను మాత్రమే శిశుజననానికి వాడుతున్నారు. ఈ మందులు రక్తప్రసారంలో కలిసిపోయి ప్రసూతి నొప్పిని భరించగలగడానికి సహకరిస్తాయి. అయితే అవి పూర్తి స్థాయి అనల్జీసియాగా పనిచేయవు. నొప్పి ఎంత వరకు తగ్గుతుందనేది ఒక్కో మందుకు ఒక్కోరకంగా ఉంటుంది. అన్ని రకాల మందులూ ఏదో ఒక రకంగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. స్థానికంగా ఇచ్చే మత్తుమందు (రీజనల్ అనస్తీషియా) తీసుకోవడానికి ఇష్టపడని వాళ్లలో చాలామంది ఈ సిస్టమిక్ (దైహిక) మందులనే ఎన్ను కుంటారు. ఎపిడ్యూరల్ లేదా వెన్నుపూస బయటి పొరకు మత్తుమందు తీసుకోవడానికి ముందుగానే వీటిని వాడినా కూడా ఎటువంటి సమస్యలూ ఉండవు. ఈ దైహిక మందులను ఇవ్వడానికి ముందుగా అదనపు మందును సిరల ద్వారా పంపించడానికి వీలుగా అనస్తీషియలజిస్టు ఇంట్రావీనస్ ఇన్ఫ్యూజన్ పంపు ఉపయోగపడుతుంది. అవసరమైనప్పుడు ఈ పంపుకు ఉన్న మీటను నొక్కితే సరిపోతుంది. ఆ పంపుద్వారా మందు కొద్దికొద్దిగా మాత్రమే శరీరంలోకి చేరుతుంది. ఇలా ఈ పంపు ద్వారా అవసరమున్నప్పుడు మందు పంపించే పద్దతినే “రోగి నియంత్రిత మత్తుమందు” (పేషంట్ కంట్రోల్డ్ అనల్జీసియా – పిసిఎ) అంటారు. గర్భాశయ కదలికలవల్ల కలిగే నొప్పి తీవ్రతను బట్టి ఎంత మోతాదులో మందు తీసుకోవాలన్నది పూర్తిగా మీ నియంత్రణలోనే ఉంటుంది. అనస్తీషియాలజిస్టు, నర్సుల పర్యవేక్షణలో సిరల ద్వారా (ఇంట్రావీనస్) మత్తుమందును తీసుకుంటారు. ఇంట్రావీనస్ మందులవల్ల కొంత నష్టం కూడా ఉంది. వీటివల్ల తల బరువుగా, తిరుగుతున్నట్టుగా ఉంటుంది. అంతేగాక వికారం, వాంతులు, శ్వాసలో తగ్గుదల, దురద, మలబద్దకం, యూరినరీ రిటెన్షన్ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. శిశువుకు పాలు ఇవ్వడానికి సైతం మొదట్లో కొంత ఇబ్బంది పడతారు. పిల్లవాడిపై ప్రభావం జరాయువు (ప్లసెంటా) ద్వారా మత్తుపదర్థాలు తల్లినుంచి బిడ్డకు జరిగే రక్తప్రసారంలో కలవడమనేది మత్తుపదార్థాలవల్ల కలిగే మరో దుష్పరిణామం. ఫలితంగా బిడ్డ పైన కూడా ఇవి ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫలితంగా గర్భాశయంలో ఉన్నప్పుడు హ్రుదయ స్పందనలో మార్పులు వస్తాయి. అయితే దీనివల్ల తీవ్ర ప్రమాదం ఉన్నట్టు ఇంతవరకు స్పష్టం కాలేదు. కడుపులోని బిడ్డకు ఈ మందులను జీర్ణం చేసుకోగల శక్తి ఉంటుంది. కాని జీర్ణప్రక్రియ తల్లిలో కన్నా శిశువులో కొంచెం నెమ్మదిగా సాగుతుంది. అందువల్ల ఇవి జీర్ణం కావడానికి ఆలస్యం కావడంతో పుట్టిన తరువాత శిశువు కొంచెం నిద్రమత్తులో ఉంటాడు. తల్లి తీసుకున్న మత్తుమందు మోతాదు బిడ్డ పుట్టిన సమయాలను బట్టి పుట్టబోయే బిడ్డపై మందు ప్రభావం ఉంటుంది. మందు తీసుకున్న తరువాత దాన్ని విచ్చిన్నం చేయడానికి తగినంత సమయం ఉంటే పుట్టిన తరువాత ఈ దుష్ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అయితే ప్రసూతి నొప్పికి ఇచ్చే మత్తుపదార్థాలు బిడ్డకు సురక్షితం అయినవేనన్నది చాలామంది వైద్యుల అభిప్రాయం. |