శస్త్రచికిత్స తరువాత నొప్పి ఉంటుందా?
కొంతవరకు ఉంటుందనే చెప్పాలి. శస్త్రచికిత్స సమయంలో పొట్టపై గాటు పెట్టాల్సి వస్తుంది కాబట్టి ఎప్పటిలాగా చురుగ్గా ఉండలేరు. పుట్టిన శిశువు పట్ల సరైన శ్రద్ధ వహించడం కష్టమవుతుంది. అందుకే ఆపరేషన్ తరువాత వచ్చే నొప్పిని అదుపులో ఉంచాలి.
నొప్పిని అదుపులో ఉంచడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
నొప్పిని తగ్గించడానికి నోటి ద్వారా లేదా సిరల ద్వారా మందును ఇస్తారు. కడుపునొప్పిని ఎక్కువసేపు భరించే శక్తి లేకుంటే నోటి ద్వారా మందును అందివ్వడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి రీజనల్ మత్తుమందుతో పాటుగా ఆపరేషన్ కి ముందే నొప్పి తగ్గించే మందును కూడా ఇవ్వవచ్చు.
సర్జరీ తరువాత కూడా అనస్తీషియాలజిస్టు మిమ్మల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉంటాడు. సిజేరియన్ డెలివరీ కోసం మీరు తీసుకున్న మత్తుమందు రకాన్ని బట్టి కూడా నొప్పి తగ్గించే మందు ఇచ్చే పద్ధతి ఆధారపడి ఉంటుంది. రీజనల్ గా ఇచ్చే మత్తుమందు తీసుకుంటే నొప్పిమందును వెన్నుముక బాహ్యపొర నుంచి ఎపిడ్యురల్ పద్ధతి ద్వారా అందిస్తారు. ఇది సర్జరీ తరువాత కూడా 18 గంటల వరకూ పనిచేస్తుంది. తల తిరగడం, మగతగా ఉండడం వంటి లక్షణాలు కూడా కనిపించవు. ఒకవేళ జనరల్ అనస్తెటిక్ తీసుకుంటే సాధారణంగా నొప్పి మందును సిరల ద్వారా ఇస్తారు. ఆపరేషన్ తరువాత మొదటిరోజు మాత్రం నోటి మత్రల ద్వారా నొప్పిని తగ్గించే ప్రయత్నం చేస్తారు.
నొప్పి తగ్గించే మందు వల్ల దుష్ప్రభావాలుంటాయా?
సాధారణంగా నొప్పి తగ్గించే మందులు చైతన్యాన్ని హరించే నార్కోటిక్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. వీటివల్ల దురద, వికారంగా ఉండడం, శ్వాస పడిపోవడం, మలబద్దకం లాంటి దుష్ఫలితాలు కనిపిస్తాయి. కాకపోతే వీటి తీవ్రత చాలా తక్కువ. చాలావరకు వాటికవే తగ్గిపోతాయి. ఒకవేళ తగ్గకపోయినా వాటికి తగిన మామూలు మందులు వాడితే సరిపోతుంది. తల్లిపాలలోకి ఈ మందులు చేరుతాయని భయపడాల్సిన అవసరం లేదు. వీటికి బానిసలవుతామన్న భయం అక్కరలేదు. సర్జరీ తరువాత లేచి ఇతర పనులు చేసుకోగలమో లేదోనన్న బెంగ కూడా వద్దు.