తరచుగా అడిగే ప్రశ్నలు

భవానీ శంకర్ కొడాలి, ఎండి

సాధారణంగా కలిగే చాలా రకాల సందేహాలకు సమాధానాలను ఇంతకుముందే ఇచ్చాం. మరింత అవగాహన కోసం ఈ సమాచారం.

రీజినల్ అనస్తీషియా తీసుకున్న తరువాత చాలారోజులు మంచానికి అతుక్కుపోవాలా?

అవసరం లేదు. అయితే కొన్ని ఆసుపత్రుల్లో మాత్రం పూర్తి ఆరోగ్య రక్షణ రీత్యా కొన్నాళ్లు బెడ్ రెస్ట్ తీసుకోవడమే మంచిదని సూచిస్తారు. ఎప్పటిలా కూర్చోగలుగుతున్నా, నడవగలుగుతున్నా ఎటూ కదలకుండా విశ్రాంతి తీసుకోవాలని చెబుతారు. మరికొన్ని ఆసుపత్రుల్లోనైతే పడక కుర్చీలో మాత్రమే కూర్చోవాలని సూచిస్తారు.

రీజనల్ అనస్తీషియా తీసుకుంటే బిడ్డను సక్రమంగా ముందుకు తోయగలనా?

తప్పకుండా, మత్తుమందు ఇవ్వడంలో వచ్చిన ఆధునిక పరిజ్ణానం వల్ల గర్భాశయ ముఖద్వారం వెడల్పు కావడానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. అప్పటి వరకూ నిలవలో ఉన్న శక్తి ఇందుకోసం ఉపయోగపడుతుంది. రీజనల్ అనస్తీశియా తీసుకోవడం వల్ల బిడ్డను ముందుకు తోసే సామర్థ్యంపై ఎటువంటి దుష్ప్రభావమూ ఉండదు. పైగా మరింత సులభంగా శిశుజననం జరగడానికి ఆస్కారం ఉంటుంది.

మత్తు (బ్లక్) ప్రభావం నాపై ఎలా ఉంటుంది?

మత్తుమందు తీసుకోవడం వల్ల నొప్పి నుంచి కొంతవరకు ఉపశమనం కలిగినా గర్భాశయ కండరాల కదలికల వల్ల కలిగే ఒత్తిడి మాత్రం తెలుస్తూనే ఉంటుంది. ప్రసూతి డాక్టరు చేస్తున్న అన్ని పరీక్షల గురించి మీకు తెలుస్తూనే ఉంటుంది. పుట్టబోయే బిడ్డ, మీ పరిస్థితులను బట్టి ఎంత తీవ్రంగా మత్తు రావాలన్నది నిర్ణయిస్తారు. అనస్తీషియాలజిస్టు ఎప్పటికప్పుడు మీ పరిస్థితి, కడుపులోని బిడ్డ పరిస్థితిని ద్రుష్టిలో ఉంచుకుని మత్తు మోతాదును సరిచేస్తారు. తాత్కాలికంగా మత్తుమందు వల్ల తల దిమ్ముగా, కాళ్లు బరువెక్కినట్టుగా, నీరసంగా, తిమ్మిరిగా, బలహీనంగా అనిపిస్తాయి.

మత్తుపోవాలంటే ఎంత సమయం పడుతుంది?

అవసరాన్ని బట్టి మత్తుమందు ఇవ్వాల్సిన సమయాన్ని పొడగిస్తారు. అంటే ఇంకా అవసరం అనుకున్నప్పుడు మరింత అనస్తీషియా ఇవ్వాల్సి వస్తుంది. అవసరమైతే ఎపిడ్యురల్ క్యాథేటర్ అమర్చిన తరువాత అదనంగా ఇతర మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రసూతి అయ్యేవరకు మీ సౌకర్యాన్ని బట్టి మందులలో మార్పుచేర్పులు చేస్తారు. అనస్తీషియాలజిస్టుకు ఒక నర్సు సహాయకారిగా ఉంటుంది. ప్రసవం అయిన తరువాత ఎపిడ్యురల్ క్యాథేటర్ (ట్యూబు)ను తీసివేస్తారు. కొన్ని గంటల్లోగా సాధారణ స్థితికి వచ్చేస్తారు.

సహజమైన ప్రసవాన్ని కోరుకుంటే తగిన సహాయం పొందగలనా?

దేనికోసమైనా మీకు వైద్యుల దగ్గరి నుంచి తగిన సహాయం లభిస్తుంది. ప్రసూతి, ప్రసవ సమయాల్లో ఎప్పుడు మీరు మనసు మార్చుకుని మత్తుమందు కావాలనుకున్నా అనస్తీషియాలజిస్టు నుంచి తగిన సాయాన్ని పొందవచ్చు. ప్రసవం మరీ దగ్గర పడనంతవరకు నొప్పిని భరించగలగడానికి మీకు మత్తుమందునివ్వడానికి ఆయన సంతోషంగా ముందుకు వస్తాడు.

సహజ ప్రసవం కన్నా ఎపిడ్యూరల్ జననం వల్ల అదనపు లాభాలేమైనా ఉన్నాయా?

మీకు గుండె లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులున్నప్పుడు ఎపిడ్యూరల్ విధానం ద్వారా జరిగే శిశుజననం ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటు, కాళ్లవాపు వంటి సమస్యలున్నప్పుడు కూడా ఈ విధానం ఎంతో ఉపకరిస్తుంది. దీని గురించి ముందుగానే మీ అనస్తీషియాలజిస్టు, ప్రసూతి వైద్యులతో చర్చించడం మంచిది.

ఎపిడ్యూరల్ అనల్జీసియా వల్ల నాకు వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉందా?

సూది గుచ్చిన భాగం చుట్టుపక్కల ప్రాంతంలో కొద్దిగా నొప్పి కలిగే అవకాశం ఉంది. కాని ఇది ఒక్కరోజులో తగ్గిపోతుంది. కొద్దిమందిలో వెన్నుభాగమంతా కూడా నొప్పి కలుగవచ్చు. కాని దీనికి ఎపిడ్యూరల్ మాత్రమే కారణమని చెప్పలేం. ఎపిడ్యూరల్ అనస్తీషియా తీసుకోకుండా సహజంగా బిడ్డలకు జన్మనిచ్చిన వాళ్లకు కూడా ఇలా వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గర్భాధారణ వల్ల ఎముకలును కలిపి ఉంచే లిగమెంట్లు బలహీనంగా, మ్రుదువుగా మారి వెన్నుముకపై ఒత్తిడి పడుతుంది. ఫలితంగా వెన్నునొప్పి వస్తుంది.

ఎపిడ్యూరల్ అనస్తీషియా తీసుకోవడం వల్ల మూత్రవిసర్జనలో ఏమైనా ఇబ్బందులుంటాయా?

ఎపిడ్యూరల్ అనస్తీషియా వల్ల బ్లాడర్ నిండుకుందనే విషయాన్ని గ్రహించలేరు. కాబట్టి ప్రసూతి వైద్యుడు లేదా నర్సు తాత్కాలిక క్యాథేటర్ సాయంతో మూత్రాన్ని తీసేస్తారు.

తరువాతి అంశం కోసం కింద క్లిక్ చేయండి(సిజేరియన్ ప్రసవం)